Harish Rao

Harish Rao: నదీజలాలు.. ద్రోహాలు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ రావు ఎదురుదాడి!

Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చకు కొనసాగింపుగా రాష్ట్ర రాజకీయాల్లో ‘నీటి యుద్ధం’ ముదిరింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణ భవన్‌లో “నదీజలాలు – కాంగ్రెస్ ద్రోహాలు” పేరిట భారీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నీటి హక్కులు కాలరాస్తున్నారని, రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు.

సాగునీటి ‘స్వర్ణయుగం’ వర్సెస్ ‘చీకటి యుగం’

తమ పదేళ్ల పాలనలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని చూసిందని, కేసీఆర్ అపర భగీరథుడిలా ప్రాజెక్టులను నిర్మిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు.

కేవలం రూ.200 కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం ద్వారా 5 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నా, రాజకీయ కక్షతో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు.

దక్షిణ తెలంగాణకు ఆధారమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పడకేయించిందని ఆరోపించారు. శ్రీశైలం సోర్సుగా ఈ ప్రాజెక్టును నిర్మించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల 50 టీఎంసీల నీరు రాష్ట్రానికి దక్కేదని, కానీ రేవంత్ సర్కార్ ఆ ఆశలను కాలరాస్తోందని విమర్శించారు.

ఇది కూడా చదవండి: Viral News: 13.5 టన్నుల బంగారం.. 23 టన్నుల నగదు.. ఇది ఇళ్లా లేక కుబేరుడి ఖజానా?

ఉత్తమ్ ‘కట్టుకథలు’ – రేవంత్ ‘పిట్టకథలు’

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన విషయాలు మాట్లాడారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

విభజన సమయంలో తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని గుర్తుచేశారు.2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేసీఆర్ నీటి వాటాలకు ఒప్పుకున్నారని చెప్పడం పచ్చి అబద్ధమని, ఆనాడే తాము కొత్త ట్రిబ్యునల్ కావాలని డిమాండ్ చేశామని పాత రికార్డులను బయటపెట్టారు.

సీఎం వ్యాఖ్యలు ‘మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టినట్లు’ ఉన్నాయని, ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించబోమని కేసీఆర్ చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి సగం సగం చదివి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

ఇది కూడా చదవండి: T20 World Cup controversy: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. వరల్డ్ కప్ ఇండియాలో ఆడేది లేదు..

పొరుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసమేనా?

కేంద్ర ప్రభుత్వం మరియు పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాంగ్రెస్ బలిపీఠం ఎక్కిస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కేంద్ర మంత్రి మరియు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలోనే కేసీఆర్ పోతిరెడ్డిపాడును తీవ్రంగా వ్యతిరేకించారని, అది ఆపకపోతే అలంపూర్ వద్ద మరో ప్రాజెక్టు నిర్మిస్తామని హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు.

గోదావరి జలాలను బనకచర్లకు తరలించేలా కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం చేసుకుందని సంచలన ఆరోపణ చేశారు.

రాజకీయాల కోసం కాదు.. రైతుల కోసం!

తమ పోరాటం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదని, తెలంగాణ రైతుల గొంతు ఎండిపోకుండా చూడటమే తమ లక్ష్యమని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాం కంటే తమ ప్రభుత్వ హయాంలో ఏడు రెట్లు అధిక ఆయకట్టును సాగులోకి తెచ్చామని గణాంకాలతో వివరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు మాని, ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *