Anil ravipudi: ట్రాప్‌లకు లొంగితే ఇప్పటికే ఉన్న కెరీర్‌కే ప్రమాదం ఏర్పడుతుంది

Anil ravipudi: టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి హీరోగా మారతారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. స్టేజ్‌పై ఆయన మాట్లాడే తీరు, కామెడీ టైమింగ్ చూసి అభిమానులు తరచూ “హీరో మెటీరియల్” అంటూ కామెంట్లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హీరోగా సినిమా చేయొచ్చుకదా అని ప్రశ్నించగా, తనకు అలాంటి ఆలోచన ఏమాత్రం లేదని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.

ఒక వ్యక్తి తన క్రాఫ్ట్‌లో టాప్‌లో ఉన్నప్పుడు దారి మళ్లించే ప్రలోభాలు సహజంగానే వస్తాయని ఆయన అన్నారు. అలాంటి ట్రాప్‌లకు లొంగితే ఇప్పటికే బలంగా ఉన్న కెరీర్‌కే ప్రమాదం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. అందుకే నటన వైపు వెళ్లి ఫోకస్ డైవర్ట్ చేయకుండా, పూర్తిగా దర్శకత్వంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

టాలీవుడ్‌లో దర్శకుడు రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ లేని ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్‌గా అనిల్ రావిపూడికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రికార్డును కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని, హీరోగా మారి ఆ ప్రయాణాన్ని రిస్క్‌లో పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. భారీ తారాగణం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంశాలతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి సెంటిమెంట్‌గా మారిందని చెప్పాలి. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో ఆ సీజన్‌లో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న ఆయన, ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’తో మరోసారి సంక్రాంతి సక్సెస్ రిపీట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *