Donald Trump: దక్షిణ అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రస్థానానికి అమెరికా ముగింపు పలికినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారకాస్‌పై అమెరికా దళాలు భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించాయని, ఈ ఆపరేషన్‌లో అధ్యక్షుడు మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
డెల్టా ఫోర్స్ ఆపరేషన్: అర్థరాత్రి వేళ ఏం జరిగింది?
అమెరికా సైన్యంలోని అత్యంత శక్తివంతమైన ‘డెల్టా ఫోర్స్’ (Delta Force) ఈ సాహసోపేతమైన ఆపరేషన్‌ను చేపట్టినట్లు సమాచారం. 2019లో ఐసిస్ ఉగ్రవాది అల్-బాగ్దాదీని హతమార్చిన ఈ ఎలైట్ విభాగం, శనివారం సూర్యోదయానికి ముందే మదురోను బంధించి దేశం దాటించినట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలంలో పరిస్థితులు:
కారకాస్ నగరంపై కనీసం ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి.విమానాలు నగరంపై తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ భీతావహ వాతావరణాన్ని సృష్టించాయి.నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోగా, భవనాలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా దక్షిణ కారకాస్‌లోని కీలక సైనిక స్థావరాల సమీపంలో దాడులు కేంద్రీకృతమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Navagraha Pradakshina: గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి?
“నార్కో-స్టేట్” పై ట్రంప్ యుద్ధం
తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందించిన ట్రంప్, వెనిజులా నేతపై విజయాన్ని ప్రకటించారు. మదురో ఒక ‘నార్కో-స్టేట్’ (మాదకద్రవ్యాల రాజ్యం) నడుపుతున్నాడని, గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారాన్ని కైవసం చేసుకున్నాడని అమెరికా గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా ప్రయోజనాల కోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ చర్యలు అనివార్యమని వాషింగ్టన్ సమర్థించుకుంటోంది.

వెనిజులా రక్షణ మంత్రి పిలుపు: ‘ప్రతిఘటించండి’
మరోవైపు, అధ్యక్షుడి బంధీ వార్తలపై వెనిజులా ప్రభుత్వం నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు. అయితే, వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో లోపెజ్ దేశవ్యాప్తంగా సైనిక దళాలను మోహరించాలని ఆదేశించారు. అమెరికా చర్యను “సామ్రాజ్యవాద దురాక్రమణ”గా అభివర్ణించిన ఆయన, ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రతిఘటించాలని కోరారు. “వారు మనపై దాడి చేయగలరు కానీ, మనల్ని లొంగదీసుకోలేరు” అని ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: MLA Son Arrest: డ్రగ్స్ తీసుకున్న MLA కొడుకు అరెస్ట్
అనిశ్చితిలో వెనిజులా భవిష్యత్తు
2013 నుండి హ్యూగో చ్వెజ్ వారసుడిగా వెనిజులాను పాలిస్తున్న మదురోను తొలగించడానికి అమెరికా నెలల తరబడి వేసిన వ్యూహం ఈ దాడులతో తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ నుండి కరేబియన్ సముద్ర తీరంలో అమెరికా దళాల కదలికలు పెరగడం, విమాన వాహక నౌకలను మోహరించడం వంటి చర్యలు ఈ ముందస్తు ప్రణాళికలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
