Punjab: కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సంక్రమించే ఇన్ఫెక్షన్లు (హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్) తీవ్రమైన సమస్యగా మారాయి. గోడలు, పడకలు, ఫర్నిచర్ వంటి ఉపరితలాలను తాకడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తూ అనేక మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా పంజాబ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక వినూత్న ఆవిష్కరణను చేశారు.
పంజాబ్ యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ అండ్ నానోటెక్నాలజీ ప్రొఫెసర్ గౌరవ్ వర్మ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన యాంటీ-బ్యాక్టీరియల్ పెయింట్ అడిటివ్ను అభివృద్ధి చేశారు. ఈ పదార్థాన్ని పెయింట్‌లో కలిపి ఆసుపత్రుల గోడలు, ఫర్నిచర్‌పై ఉపయోగిస్తే, వాటిపై ఉన్న హానికర బ్యాక్టీరియాను ఇది సమర్థవంతంగా నాశనం చేస్తుంది.
ఈ పరిశోధనకు భారత ప్రభుత్వం 2025 డిసెంబర్ 31న పేటెంట్ మంజూరు చేసింది. ముఖ్యంగా ఈ పెయింట్ విషరహితం కావడం, గాలిలో కలవకపోవడం వల్ల ఆసుపత్రుల్లో వినియోగానికి పూర్తిగా సురక్షితమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీంతో రోగులు, వైద్య సిబ్బంది ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.
ఈ ఆవిష్కరణకు బీజం 2018లో పడింది. ఫుడ్ మైక్రోబయాలజిస్ట్ శుభీ జోషి ప్రొఫెసర్ గౌరవ్ వర్మను సంప్రదించడంతో నానో మెటీరియల్స్‌పై పరిశోధన ప్రారంభమైంది. కొవిడ్ సమయంలోనూ భౌతిక దూరం పాటిస్తూ ఈ బృందం తమ ప్రయోగాలను కొనసాగించింది. బయోఫిజిక్స్ విభాగానికి చెందిన అవనీత్ సైనీ, ఎమ్మెస్సీ విద్యార్థిని దీక్షా శర్మ కూడా ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ గౌరవ్ వర్మ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలోనూ సమాజానికి ఉపయోగపడే శాస్త్రీయ ఆలోచనలు ఉంటాయని, పెయింట్లు కేవలం భవనాలకు అందం ఇవ్వడానికే కాదు, ప్రాణాలను కాపాడే సాధనాలుగా కూడా మారాలని తన ఆకాంక్షను వెల్లడించారు. ఈ కొత్త ఆవిష్కరణతో ఆసుపత్రులు, క్లినిక్‌లలో రోగుల భద్రత మరింత మెరుగుపడనుందని నిపుణులు భావిస్తున్నారు.
