Revanth Reddy: అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత స్పష్టమైన ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని, ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సంబంధించి 2026 మార్చి నెలలో మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర తొలి దశలో ప్రక్షాళన పనులు చేపడతామని, ఇందుకు సంబంధించి సంక్రాంతి నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) పై పూర్తి స్పష్టత వస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు ఏడీబీ (ADB) బ్యాంకు రూ. 4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించిందని సభకు తెలిపారు.
నగరాల అభివృద్ధిలో నదుల పాత్రను నొక్కి చెప్పిన ముఖ్యమంత్రి, అనంతగిరి కొండల్లో మొదలై వాడపల్లి వరకు 240 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీ నదిని గత పాలకులు విస్మరించారని విమర్శించారు. నిజాం కాలంలోనే మూసీ అభివృద్ధికి పునాదులు పడ్డాయని, అయితే ఆ తర్వాత వచ్చిన వారు జలవనరులను ఆగం చేసి, డ్రైనేజీలను కబ్జా చేసి ఫాంహౌస్లు నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Kavitha: బీఆర్ఎస్ కు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ అసెంబ్లీ రావలిసిందే
మూసీ కాలుష్యం వల్ల ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ శాపానికి తోడు ఈ మురుగు నీటి వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ తీరంలో నీళ్లు తాగితే కనీసం సంతానం కూడా కలగని దుస్థితి నెలకొందని, ఈ పాపం ఎవరిదని ఆయన నిలదీశారు.
ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్లో సబర్మతి, యూపీలో గంగానది ప్రక్షాళన కోసం వేలాది కుటుంబాలను తరలించిన ఉదాహరణలను ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులైన వారికి ప్రభుత్వం మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. మూసీ సుందరీకరణలో భాగంగా 51 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మీరాలం ట్యాంక్పై రూ. 450 కోట్లతో బ్రిడ్జి వంటి అద్భుతమైన నిర్మాణాలు రాబోతున్నాయని తెలిపారు. బాపూఘాట్ వద్ద మూసీ, ఈసా నదులు కలిసే చోట ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును చేపడతామని, అక్కడ అన్ని మతాల ప్రార్థనా మందిరాలను నిర్మించి సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలుపుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
