Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటగా, ఆ వేడుకల జోష్‌లో మద్యం అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక రికార్డులను సృష్టించాయి. 2025 డిసెంబర్ నెలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే మందుబాబులు ఏ స్థాయిలో ఖజానాను నింపారో స్పష్టమవుతోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ. 5,102 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఒకే నెలలో రూ. 5,000 కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత ఏడాది ఇదే నెలలో జరిగిన రూ. 3,805 కోట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి సుమారు రూ. 1,300 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించింది.
ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 25 నుంచి 31 వరకు జరిగిన ఏడు రోజుల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ వారం రోజుల్లోనే మొత్తం రూ. 1,350 కోట్ల మద్యం అమ్ముడైంది. అందులోనూ డిసెంబర్ 29, 30, 31 తేదీల్లోనే దాదాపు రూ. 975 కోట్ల విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 29న రూ. 280 కోట్లు, 30న రూ. 380 కోట్లు, ఇక ఏడాది ఆఖరి రోజైన డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు సుమారు రూ. 315 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. కేవలం ఈ మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read: Andhra Pradesh: జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు!
ఈ భారీ అమ్మకాల వెనుక ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి న్యూ ఇయర్ వేడుకల కోసం ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల సమయాన్ని పొడిగించడం. డిసెంబర్ 31న వైన్ షాపులకు రాత్రి 12 గంటల వరకు, బార్లకు ఒంటి గంట వరకు అనుమతి ఇవ్వడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. రెండోది, రాష్ట్రంలో ఒకేసారి వచ్చిన సర్పంచ్ ఎన్నికల వాతావరణం. అభ్యర్థుల ప్రచారం, గ్రామాల్లోని రాజకీయ సమీకరణల వల్ల మద్యం వినియోగం గణనీయంగా పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీర్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కావడం విశేషం. ఈ అసాధారణ వృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
