Gali Janardhan Reddy

Gali Janardhan Reddy: బళ్లారిలో ఉద్రిక్తత: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి!

Gali Janardhan Reddy: కర్ణాటకలోని బళ్లారి నగరం ఒక్కసారిగా రాజకీయ రణరంగంగా మారింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో మొదలైన చిన్న వివాదం, చిలికి చిలికి గాలివానలా మారి చివరకు తుపాకీ కాల్పులకు దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (KRPP ఎమ్మెల్యే) వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణలో రాజశేఖర్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం నగరం అంతటా 144 సెక్షన్ విధించి, పోలీసులు భారీగా మోహరించారు.

వివాదం ఎక్కడ మొదలైంది?
బళ్లారి నగరంలో మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి నివాసం ఉండే హవ్వబావి ప్రాంతంలోని ఇంటి గోడలకు ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించారు. దీనిని గాలి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. సతీష్ రెడ్డి ఏకంగా గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందే కుర్చీ వేసుకుని కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Also Read: Delhi: కస్టమర్లకు శుభవార్త..దేశవ్యాప్తంగా ఉచిత వైఫై కాలింగ్ సేవలు

సరిగ్గా గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నుంచి తన ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో సతీష్ రెడ్డి తన గన్‌మన్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీనికి ప్రతిగా గాలి వర్గం నుంచి కూడా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కాల్పుల్లో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త అక్కడికక్కడే మృతి చెందగా, సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సతీష్ రెడ్డి బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ.. ఇది తనపై జరిగిన పక్కా ప్లాన్ అని, తనను చంపేందుకే ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. భరత్ రెడ్డి కుటుంబానికి నేర చరిత్ర ఉందని, రౌడీయిజంతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. గాలి జనార్దన్ రెడ్డి కావాలనే గొడవ సృష్టించి కాల్పులు జరిపారని, తమ కార్యకర్తను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరంగా దీనిపై పోరాడుతామని స్పష్టం చేశారు.

పోలీసుల చర్యలు – 144 సెక్షన్
ఈ ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ పవన్ నెజ్జూరు రంగంలోకి దిగారు. పరిస్థితి అదుపు తప్పకుండా నగరం మొత్తం 144 సెక్షన్ అమలు చేశారు. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, బయటి వ్యక్తులు నగరంలోకి రాకుండా కట్టుదిట్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డితో సహా దాదాపు డజను మందిపై కేసులు నమోదయ్యాయి. కాగా, ఎస్పీగా ఉన్న శోభారాణి బదిలీ అయిన వెంటనే ఈ ఘటన జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బళ్లారిలో ఎటు చూసినా పోలీసు పహారా కనిపిస్తోంది, సామాన్య ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *