Cp sajjanar: మందుబాబులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

Cp sajjanar: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి రోడ్లపైకి వస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

నగర వ్యాప్తంగా ఈ రాత్రి 120 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అతివేగంగా వాహనాలు నడపడం, ప్రమాదకర డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తన, న్యూసెన్స్‌కు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని, అవి విషాదంగా మారకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ట్రాఫిక్ ఆంక్షలు, భారీ వాహనాలపై నిషేధం

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ఫ్లైఓవర్లు మూసివేయనుండగా, భారీ వాహనాల ప్రవేశంపై ఈ రాత్రి నుంచి నిషేధం అమల్లోకి రానుంది.
ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. ఈవెంట్స్ జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.

ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ప్రత్యేకంగా విధుల్లో ఉండనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *