MLA: జనవరి 6 లేదా 9న డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు

MLA: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి పదవి అంశం హాట్‌టాపిక్‌గా మారింది. డి.కె. శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం జనవరి 6 లేదా 9వ తేదీన డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రి కావడం 200 శాతం ఖాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. కొంతమంది కీలక వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ప్రకటన చేస్తున్నాను” అని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉంటానని కూడా పేర్కొన్నారు.

కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై గత కొంతకాలంగా చర్చ కొనసాగుతూనే ఉందని, ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయని ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలని, అయితే తనకు మాత్రం పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.

డి.కె. శివకుమార్ విషయంలో ఇకపై మౌనంగా ఉండబోమని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. శివకుమార్ తమ నాయకుడని, ముఖ్యమంత్రి పదవి విషయంలో జరిగిన ఒప్పందం గురించి ఆయన తమతో స్వయంగా చెప్పారని వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ మరియు పార్టీ అధిష్ఠానానికి మధ్య అవగాహన లేకపోతే ఆయన అలా చెప్పేవారు కాదని అభిప్రాయపడ్డారు.

సిద్ధరామయ్య నిజాయతీకి కేరాఫ్: బైరతి సురేశ్

ఇదిలా ఉండగా, కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేశ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రశంసలు కురిపించారు. దేశంలో నిజాయతీ కలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది సిద్ధరామయ్యే అని ఆయన అన్నారు. సిద్ధరామయ్య ఇప్పటివరకు 16 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారని, రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు.

ఆయన విజయాలపై కొందరు అసూయపడుతున్నారని, అయినప్పటికీ వారిని కూడా తమవారిగా భావించి క్షమిస్తామని బైరతి సురేశ్ వ్యాఖ్యానించారు. 1984 నుంచి రాజకీయాల్లో ఉన్న సిద్ధరామయ్యలాంటి నిజాయతీ గల నాయకుడు మరొకరు లేరని ఆయన అభిప్రాయపడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *