Crime News: పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవవధువు, నెల కూడా గడవకముందే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి భర్తపైనే అనుమానాలు ఉన్నాయంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రేమ వివాహం.. నెలలోనే విషాదం
పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రాజు, మహబూబ్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు నిరాకరించడంతో, గత నవంబర్ నెలలో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఈ జంట రాజేంద్రనగర్‌లోని జనచైతన్య ఫేజ్-2లో నివాసం ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: TG Assembly: ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన రేవంత్
అసలేం జరిగింది?
ఆదివారం రాత్రి ఐశ్వర్య తన పుట్టింటికి వెళ్లి, కొంత సమయం గడిపి తిరిగి భర్తతో కలిసి నివాసానికి చేరుకుంది. ఇంటికి వచ్చిన కాసేపటికే ఐశ్వర్యకు ఒక్కసారిగా ఫిట్స్ (మూర్ఛ) రావడంతో ఆందోళన చెందిన రాజు, వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఐశ్వర్య మృతి చెందినట్లు ధృవీకరించారు.
అల్లుడిపై అత్తమామల ఆరోపణలు
విషయం తెలుసుకున్న ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కూతురిని రాజే చంపేశాడని వారు ఆరోపిస్తున్నారు. “అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి, ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ఎలా చనిపోతుంది?” అని వారు రాజును నిలదీస్తున్నారు. పెళ్లయి నెల కూడా కాకుండానే వధువు(కోడలు) మృతి చెందడంతో భర్త ఇంకా తమ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసలు మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో తేలుతాయని అధికారులు వెల్లడించారు.
