TG Assembly: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు నేటి నుంచి అత్యంత ఆసక్తికరంగా ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలు కొలువుదీరనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాన ఆకర్షణగా ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుమారు 9 నెలల విరామం తర్వాత అసెంబ్లీకి హాజరుకాబోతున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య వాడీవేడి చర్చలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
సమావేశాల తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిల మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ సంతాప తీర్మానాలు చేయనుంది. అనంతరం ప్రభుత్వం పలు కీలక బిల్లులను, ఆడిట్ నివేదికలను సభ ముందు ఉంచనుంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధి పెంపు, వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి పెంచడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడం వంటి కీలక నిర్ణయాలకు ఈ సెషన్‌లో చట్టబద్ధత కల్పించనున్నారు. అలాగే తెలంగాణ జీఎస్‌టీ సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి.
ఈ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదీ జలాల అంశం రాజకీయంగా వేడి పుట్టించనుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ (DPR) వెనక్కి రావడానికి ఎవరి వైఫల్యం కారణమనే అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం 45 టీఎంసీల నీటినే అడిగిందని, ఇది తెలంగాణకు నష్టమని విపక్షాలు ఆరోపిస్తుండగా.. 90 టీఎంసీల కోటా కోసం పోరాడుతున్నామని సర్కార్ చెబుతోంది. ఈ అంశంపై అధికార పక్షం అసెంబ్లీలో ‘పవర్ పాయింట్ ప్రజంటేషన్’ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Also Read: Anakapalli: టాటానగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫ్యూచర్ సిటీ భూముల వ్యవహారం, ఫుట్‌బాల్ టోర్నీ కోసం వెచ్చించిన నిధుల వంటి అంశాలను సభలో ప్రస్తావిస్తామని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మరోవైపు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వ్యూహాలు రచించింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నీళ్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు వారు సిద్ధమయ్యారు.
సమావేశాల షెడ్యూల్
తొలిరోజు సమావేశం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం నిర్వహించి, సభ ఎన్ని రోజులు జరగాలనేది నిర్ణయిస్తారు. అయితే డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ఏడాది ఆఖరి రోజు, జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సభకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. తిరిగి జనవరి 2న సమావేశాలు కొనసాగవచ్చని సమాచారం. సుమారు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ సెషన్ నడిచే అవకాశం ఉంది. కేసీఆర్ రాకతో సభలో చర్చలు ఏ మలుపు తిరుగుతాయోనని రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
