Telangana

Telangana: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..

Telangana: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన యంత్రాంగంలో భారీ మార్పులు చేస్తూ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, పాలనను మరింత వికేంద్రీకరించేందుకు వీలుగా జోనల్ కమిషనర్ల నియామకంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

ఈ బదిలీల్లో అత్యంత కీలకమైన మార్పు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్‌కు సంబంధించి జరిగింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయనను ప్రభుత్వం అక్కడి నుండి బదిలీ చేసింది. జయేశ్ రంజన్‌ను మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ (HMDA) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే, ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ బాధ్యతల్లో కూడా కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన నిర్వహించిన పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవో బాధ్యతలను స్వయంగా సీఎస్ రామకృష్ణారావుకు అప్పగించడం గమనార్హం.

Also Read: TGSRTC: TGSRTCలో కొలువుల జాతర.. 198 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

మరికొన్ని కీలక నియామకాల్లో భాగంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. హరితను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డిని నియమించగా, ఎస్సీ కార్పొరేషన్ వీసీ, ఎండీగా హన్మంతు నాయక్‌కు బాధ్యతలు కట్టబెట్టారు. భవేశ్ మిశ్రాను పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ అదనపు సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో పాలనను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం 12 మంది ఐఏఎస్ అధికారులను వివిధ జోన్లకు కమిషనర్లుగా నియమించింది. ఇందులో శేరిలింగంపల్లికి హేమంత్ సహదేవ్, కూకట్‌పల్లికి అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్‌కు సందీప్ కుమార్ ఝా, చార్మినార్‌కు ఎస్. శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరితో పాటు గోల్కొండకు ముకుంద్ రెడ్డి, ఖైరతాబాద్‌కు ప్రియాంక ఆల, రాజేంద్రనగర్‌కు అనురాగ్ జయంతి, సికింద్రాబాద్‌కు ఎన్. రవికిరణ్, శంషాబాద్‌కు చంద్రకళ, ఎల్బీనగర్‌కు హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజిగిరికి సంచిత్ గంగ్వార్, ఉప్పల్‌కు రాధికా గుప్తాను జోనల్ కమిషనర్లుగా నియమించారు. ఈ భారీ బదిలీలతో రాష్ట్ర యంత్రాంగంలో సరికొత్త జోష్ వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *