America: దేశం వదిలిపోతే 2.7 లక్షలు ఇస్తాం

America: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేందుకు ట్రంప్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది చివరి లోగా స్వదేశానికి తిరిగి వెళ్లే అక్రమ వలసదారులకు 3,000 డాలర్లు (సుమారు రూ. 2.7 లక్షలు) నగదుతో పాటు ఉచిత విమాన ప్రయాణ సదుపాయం కల్పిస్తామని డిసెంబర్ 22న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) వెల్లడించింది.

ఈ పథకంలో భాగంగా దేశం విడిచి వెళ్లనందుకు విధించిన సివిల్ జరిమానాలను కూడా పూర్తిగా రద్దు చేయనున్నట్లు DHS స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే వలసదారులు ‘CBP హోమ్’ అనే మొబైల్ యాప్ ద్వారా స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అమెరికా ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపింది.

పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు DHS పేర్కొంది. అక్రమ వలసదారులు తమకు, తమ కుటుంబాలకు ఇచ్చుకోగల ఉత్తమ బహుమతి ఇదేనని వ్యాఖ్యానించింది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసి సమాచారం నింపితే చాలు, మిగతా ప్రక్రియ అంతా ప్రభుత్వమే పూర్తి చేస్తుందని తెలిపింది.

అయితే ఈ ఆఫర్‌ను వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే అక్రమ వలసదారులను గుర్తించి అరెస్టు చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అలాగే వారిపై శాశ్వత నిషేధం విధించి, భవిష్యత్తులో అమెరికాలోకి అడుగుపెట్టే అవకాశం లేకుండా చేస్తామని హెచ్చరించారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 1.9 మిలియన్ల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికా విడిచినట్లు క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. వేలాది మంది ఇప్పటికే ‘CBP హోమ్’ యాప్‌ను ఉపయోగించారని తెలిపారు. గతంలో మే నెలలో 1,000 డాలర్లుగా ఉన్న ప్రోత్సాహకాన్ని ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా మూడు రెట్లు పెంచినట్లు ఆమె పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *