Pawan Kalyan: జనసేన పార్టీ పదవి–బాధ్యత కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల్లో ఉన్న నేతలతో ఆయన సమావేశమై పార్టీ దిశా–దశపై స్పష్టత ఇచ్చారు.
అనేక సామాజికవర్గాల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు పవన్ తెలిపారు. అదే విధంగా రెల్లి సామాజికవర్గానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఎలాంటి తేడా లేకుండా అందరికీ అవకాశాలు ఇచ్చామని స్పష్టం చేశారు.
పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి పదవులు ఇచ్చినట్లు పవన్ తెలిపారు. పోలీసులు కొట్టినా పార్టీ జెండాను వదలని ఓ మహిళకు పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, పదవి చిన్నదైనా పెద్దదైనా అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
తాను ప్రాంతీయ దృక్పథంతో పార్టీ పెట్టలేదని, జాతీయ ఆలోచనతోనే ప్రాంతీయ పార్టీగా జనసేనను స్థాపించానని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ లక్ష్యం కేవలం పదవులు కాదని, సమాజంలో మార్పు తీసుకురావడమేనని ఆయన స్పష్టం చేశారు.
