Youtuber: యూట్యూబర్ కి ఎక్కడివి? లాంబో.. బెంజ్ కార్లు సీజ్..

Youtuber: ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన యూట్యూబర్ అనురాగ్ ద్వివేదిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన అనురాగ్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు లంబోర్ఘిని ఉరుస్, బీఎండబ్ల్యూ Z4, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.

యూట్యూబ్ వేదికగా ‘స్కై ఎక్స్చేంజ్’ సహా పలు నిషేధిత బెట్టింగ్ యాప్‌లను అనురాగ్ ప్రచారం చేసినట్లు ఈడీ గుర్తించింది. భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధమైనప్పటికీ, అతని వీడియోల ప్రభావంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ యాప్‌లలో చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేశారు.

హవాలా లావాదేవీలు, బినామీ బ్యాంక్ ఖాతాలు (మ్యూల్ అకౌంట్స్), మధ్యవర్తుల సహాయంతో నగదు రూపంలో చెల్లింపులు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమంగా వచ్చిన డబ్బును చట్టబద్ధంగా చూపించేందుకు లగ్జరీ కార్లు, ఇతర విలాస వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ తేల్చింది. అంతేకాకుండా, ఈ డబ్బుతో దుబాయ్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది.

ఈ అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో సోను కుమార్ ఠాకూర్, విశాల్ భరద్వాజ్ అనే మరో ఇద్దరు నిందితుల పాత్రను గుర్తించారు. మొత్తం ఎంత మేర అక్రమ సంపాదన జరిగిందన్న అంశంతో పాటు ఈ వ్యవహారంలో పాల్గొన్న ఇతరుల వివరాలపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆస్తుల జప్తులు, అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *