Omar Abdullah: ఓట్ల చోరీ మాకు సంబంధం లేదు

ఓట్ల చోరీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశమే: ఒమర్ అబ్దుల్లా

ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ అంశానికి ‘ఇండియా’ విపక్ష కూటమితో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవేనని తెలిపారు.

ప్రతి రాజకీయ పార్టీకి తనదైన అజెండాను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) అంశాలను కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన అజెండాగా మార్చుకుందని చెప్పారు. ఈ విషయంలో ఏం చేయాలన్నది ఆయా పార్టీలే నిర్ణయించుకోవాలని, ఇతర పార్టీలు సూచనలు చేయలేవని స్పష్టం చేశారు.

ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ నినాదంతో బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభ జరిగిన మరుసటి రోజే ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

అలాగే ‘ఇండియా’ కూటమి పరిస్థితిపై కూడా ఒమర్ అబ్దుల్లా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమి పరిస్థితి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నట్లుగా ఉందని అన్నారు. బీహార్ ఎన్నికల విషయంలో విపక్ష కూటమి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఆయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *