Missing Case: తండ్రి తిడితే సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు లేదా కోపంతో కొన్ని రోజులు నాన్నతో మాట్లాడటం మానేస్తారు. కానీ ఈ అబ్బాయి ఏకంగా 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ నుండి రైల్లో కర్ణాటక వెళ్ళాడు. రాత్రి అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. చివరికి అతడిని రాయచూరులో గుర్తించి సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు.
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
పొద్దుటూరు సీఐ కొండారెడ్డి చెప్పిన సమాచారం ప్రకారం.. పొద్దుటూరులో నివసిస్తున్న ఓ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏదో విషయంలో ఆ సోదరుల మధ్య గొడవ జరుగుతుంటే, అది గమనించిన తండ్రి గొడవలు పడకూడదని మందలించారు. దీంతో ‘నన్నే మందలిస్తారా’ అని 9వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇంట్లో నుండి సైకిల్ పైన నంద్యాల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పొద్దుటూరు నుండి నంద్యాల సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎలాగైనా వెళ్లాలని రాజుపాళెం, చాగలమర్రి మీదుగా రాత్రి పడుకోకుండా, ఎక్కడా ఆగకుండా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయాడు.
అక్కడికైతే కోపంతో వెళ్లిపోయాడు కానీ, ఎక్కడికైనా వెళ్లాలన్నా లేదా ఉండాలన్నా డబ్బులు కావాలి కదా! అందుకు తన దగ్గర ఉన్న సైకిల్‌ను ఒక షాపులో అమ్మాలని అనుకున్నాడు. కానీ షాపు ఓనర్ “ఎందుకు అమ్ముతున్నావు? మీది ఏ ఊరు?” అనే ప్రశ్నలు అడగడంతో, సైకిల్ అమ్మకుండా నేరుగా నంద్యాల రైల్వే స్టేషన్‌కు వెళ్లిపోయాడు. అక్కడ సైకిల్‌ను వదిలేసి, దొరికిన రైల్లో కర్ణాటక వెళ్లిపోయాడు.
పోలీసుల గాలింపు..
తండ్రి ఇచ్చిన పోలీస్ కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన పోలీసులు, టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ నరసింహ నాయుడు బాలుడి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇక్కడే ఒక చిక్కు వచ్చింది.. అతని దగ్గర మొబైల్ లేదు, దీంతో వెతకడం కష్టంగా మారింది. అప్పుడు పోలీసులు సీసీటీవీ దృశ్యాలపై దృష్టి పెట్టారు. ఒక కెమెరాలో సైకిల్ పైన స్కూల్ బ్యాగ్ వేసుకొని వెళ్తున్న అబ్బాయి కనిపించాడు. ఇలా ప్రతి కెమెరాను పరిశీలించగా అతను నంద్యాల వెళ్లినట్టు తెలిసింది.
అక్కడికి వెళ్లి రోడ్లు, బస్ స్టాప్‌లు వెతుకుతుండగా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న సైకిల్‌ను పోలీసులు గుర్తించారు. రైల్వే అధికారుల సమాచారంతో అతను రైలులో రాయచూర్‌కు వెళ్లినట్టు తెలుసుకున్నారు. వెంటనే పొద్దుటూరు పోలీసులు అక్కడికి వెళ్లి బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
