Maoists Surrender: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మావోయిస్టుల అడ్డాగా భావించే దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. అశాంతి మార్గాన్ని వీడి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఏకంగా 63 మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ ప్రాంతంలో శాంతి స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలకు ఇది ఒక భారీ విజయమని చెప్పవచ్చు. జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమంలో 18 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉండటం విశేషం. దశాబ్దాలుగా అడవులనే నమ్ముకుని సాగించిన పోరాటాన్ని విడిచి, అభివృద్ధి బాట పట్టాలని వారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ లొంగుబాటు కేవలం సంఖ్యాపరంగానే కాకుండా, మావోయిస్టు కేడర్‌కు తగిలిన పెద్ద దెబ్బగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఎందుకంటే లొంగిపోయిన వారిలో 36 మందిపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. వీరిపై ఉన్న మొత్తం రివార్డు విలువ రూ. 1.19 కోట్ల పైమాటే.
ఇది కూడా చదవండి: Sankranti Ideas: సంక్రాంతికి సింపుల్ టిప్స్..ఇంటి ముందు ఇలా అలంకరించుకోండి
వీరిలో ఏడుగురిపై అత్యధికంగా ఎనిమిది లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉండగా, మరికొంతమందిపై ఐదు లక్షలు, రెండు లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. వీరంతా దర్బా, దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్ మాఢ్ డివిజన్లతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో కూడా అత్యంత చురుకుగా ఉంటూ పలు కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పునర్జన్మకు పునరావాసం’ అనే పథకం అడవి బిడ్డల్లో మార్పు తీసుకురావడానికి ప్రధాన కారణమైంది. లొంగిపోయిన వారికి తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన పునరావాస సౌకర్యాలను కల్పిస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. బస్తర్ డివిజన్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, హింసా మార్గాన్ని వీడే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు. ఈ భారీ లొంగుబాటుతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
