Zomato: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో ఒక్కో ఆర్డర్‌కు రూ. 5గా ఉన్న ఈ ఫీజును ఇప్పుడు రూ. 12కి పెంచింది. ఈ కొత్త ధర వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం ప్రధానంగా పండుగ సీజన్‌లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉన్నందున, ఆదాయాన్ని పెంచుకోవడానికి తీసుకున్నట్లు తెలుస్తోంది. జొమాటో తన పోటీదారులైన స్విగ్గీ, ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలతో పోలిస్తే ఆదాయంలో వెనుకబడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ రుసుము పెంపు ద్వారా జొమాటో తన ఆదాయ మార్గాలను మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ప్లాట్‌ఫారమ్ ఫీజు అనేది కస్టమర్ డెలివరీ ఫీజు లేదా రెస్టారెంట్ బిల్లు కాకుండా, అదనంగా జొమాటో సంస్థ వసూలు చేసే రుసుము. ఇది కంపెనీకి అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది.
Also Read: TG News: తెలంగాణలో అన్నదాతకు తప్పని అరిగోస!
ఈ రుసుమును కంపెనీ తన ప్లాట్‌ఫారమ్ ను నిర్వహించడానికి, సాంకేతికతను మెరుగుపరచడానికి, ఇతర నిర్వహణ ఖర్చులను భరించడానికి ఉపయోగిస్తుంది. జొమాటో గోల్డ్ సభ్యత్వంతో ఆర్డర్ చేసే వారికి కూడా ఈ ప్లాట్‌ఫారమ్ ఫీజు వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. అయితే, జొమాటో రెస్టారెంట్లలో నేరుగా భోజనం చేసే (dine-in) వారికి ఇది వర్తించదు. ఈ పెంపుతో కస్టమర్లపై ఆర్డర్ ఖర్చు మరింత పెరుగుతుంది. కాగా జొమాటో బాటలోనే దాని పోటీ సంస్థ స్విగ్గీ కూడా ఇటీవలే తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో జీఎస్టీతో కలిపి ఈ ఫీజును రూ. 12 నుంచి రూ. 14కి పెంచినట్లు తెలిసింది. అయితే, ఆర్డర్ల ఒత్తిడి తగ్గిన తర్వాత ఈ పెంపును వెనక్కి తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు క్విక్ కామర్స్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ప్రభావం వాటి ఆర్థిక ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోంది.