Maharastra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం వరించిన మహాయుతి కూటమి తరఫున ఎవరు సీఎం అవుతారు? అత్యధిక సీట్లు పొందిన బీజేపీ నేతను సీఎంగా ఎన్నుకుంటారా? కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నానికి దోహదం చేసి బీజేపీ నిలదొక్కుకునేలా చేసిన ఏక్‌నాథ్ షిండేనే ఆ పదవి మళ్లీ వరిస్తుందా? షిండే రాకతోపాటు మహాయుతి కూటమి బలోపేతానికి చేయూతగా నిలిచిన ఎన్‌సీపీ చీలికవర్గం నేత అజిత్ పవార్‌ను సీఎం సీట్లో కూర్చొబెడుతుందా? అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
Maharastra: మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు గాను 223కు పైగా స్థానాలను మహాయుతి కూటమి గెలుపు బాటలో ఉన్నది. వాటిలో బీజేపీ 130కి పైగా స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నది. శివసేన 56, ఎన్‌సీపీ 36 స్థానాలకు పైగా విజయతీరాలకు చేరనున్నాయి. అయితే ఇప్పటికే సీఎం ఎన్నికపై వాదోపవాదాలూ చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు ఈ నెల 26న శాసనసభాపక్ష నేతలను ఎన్నుకోనున్నారు. ఈమేరకు ఈ నెల 25న బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానున్నట్టు తెలిపింది.
Maharastra: ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు పొందిన బీజేపీ నేతనే ముఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నట్టు ప్రచారం ఊపందుకొన్నది. బీజేపీ నేతలు కూడా అదే ధ్యాసతో ఉన్నారు. తొలుత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా ప్రధాని మోడీ, అమిత్‌షా ప్రకటనే తరువాయి అన్నట్టుగా ఆ నేతలు ఉన్నారు. అయితే గెలుపు సంబురంలో ఉండటంతో ఎవరూ దానిపై స్పందించడం లేదు.
Maharastra: అత్యధిక సీట్లు ప్రాధాన్యంగా సీఎం ఎన్నిక ఉంటుందన్న చర్చతో సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. మెజారిటీ ప్రాధాన్యం కాదని, కూటమి ఐక్యత, ఒప్పందాలు, అవగాహనతోనే సీఎం ఎన్నిక ఉంటుందని తెలిపారు. అంటే నర్మగర్భంగా తనకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టుగా ఆయన వైఖరి ఉన్నదని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఈ దశలో ఎన్‌సీపీ నేతలు కూడా తమ నేత అజిత్ పవార్‌కే సీఎం సీటు దక్కాలని కోరుకుంటున్నారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొన్నది.
Maharastra: ఈ దశలోనే బీజేపీకి చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మహాయుతి కూటమి తరఫున ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ రాష్ట్ర నేతలు ప్రకటిస్తున్నారు. దీంతో బీజేపీకి అవకాశం వస్తే దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అయితే ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సీపీకి అవకాశం వస్తే అజిత్ పవార్‌లలో ఎవరో ఒకరు సీఎం అవుతారని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ వైపే మిత్ర పక్షాలు కూడా మొగ్గుచూపే అవకాశం ఉంటుందని, బీజేపీ కూడా ఒత్తిడి తెస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.