West Bengal

West Bengal: బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు!

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్. రవి గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ పాలనకు అధికారికంగా తెర పడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేశారు.

చారిత్రక విజయం దిశగా బీజేపీ:
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వ పదవీ కాలం మే 7తో ముగిసింది. తాజా ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాల్లో గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించింది. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయడంతో, రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మార్గం సుగమమైంది. మే 8న బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. అనంతరం మే 9న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది.

ముహూర్తం వెనుక వ్యూహం:
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మే 9న ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు హాజరుకానున్నారు. అయితే మే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ రోజు బెంగాల్ ప్రజలు అమితంగా ఆరాధించే కవి, నోబెల్ విజేత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. బీజేపీని ‘బయటి వ్యక్తుల పార్టీ’గా ముద్ర వేయాలని చూస్తున్న టీఎంసీకి చెక్ పెడుతూ, బెంగాల్ సంస్కృతితో తాము మమేకమయ్యామని చాటి చెప్పడానికే ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

దీదీ పోరాటం.. కోర్టుకు టీఎంసీ:
మరోవైపు మమతా బెనర్జీ ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించడం లేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఓట్ల లూటీ జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. అందుకే రాజీనామా చేయబోనని, తనను కావాలంటే బర్తరఫ్ చేయాలని ఆమె సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని టీఎంసీ నాయకత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *