Weather: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో వర్షాలు బారీగా కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాతావరణ శాఖ అధికారుల ప్రకారం, రుతుపవనాల గమనాన్ని పరిశీలించినప్పుడు, దక్షిణ మరియు పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.
ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ మరియు వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచించారు.
ఇక హైదరాబాద్ నగరంలో కూడా రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపించింది. శుక్రవారం బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లక్డీకపూల్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్రంగా అస్తవ్యస్తమైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.