Crime News: విశాఖపట్నంలో మళ్లీ ఓ హత్యా ఘటన కలకలం రేపింది. మాధవధార ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే లోహిత్ అనే యువకుడు దుండగుల కత్తి దాడికి గురయ్యాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పాత కక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.
పక్కా ప్లాన్‌తో హత్య:
బుధవారం రాత్రి జనసమ్మోహిత ప్రాంతంలో నలుగురు దుండగులు ముందుగానే పథకం వేసుకుని లోహిత్‌ను చుట్టుముట్టారు. అక్కడే నిలిపివేసి అందరి కళ్ల ముందే కత్తులతో దాడి చేశారు. ఆ దృశ్యం చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ధైర్యం చేసి అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే లోహిత్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు.
రౌడీ షీటర్‌ల మధ్య పాత కక్షలు:
హత్యకు గురైన లోహిత్ (22)పై ముందే రౌడీ షీట్ కూడా ఉందని తెలుస్తోంది. మాధవధారలో జరిగిన కుంచుమాంబ పండుగ సందర్భంగా నలుగురు రౌడీ షీటర్లు కలిసి రాత్రి వరకు మద్యం సేవించినట్టు సమాచారం. ఆ తర్వాత పాత కక్షల కారణంగా లోహిత్‌పై కత్తులతో దాడి చేశారు.
ఇది కూడా చదవండి: Crime News: నాకు దక్కనిది మరొకరికి దక్కనివ్వను.. యువతి హత్యచేసింది ప్రియుడేనని తేల్చిన పోలీసులు
పోలీసుల దర్యాప్తు ముమ్మరం:
హత్య అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
ప్రజలలో భయం, కుటుంబంలో విషాదం:
ఓ రౌడీ షీటర్ అయినా, జనాల మధ్య ఇలా దారుణ హత్య జరగడం ప్రజల్లో భయాన్ని కలిగించింది. మాధవధారలో ఇప్పటికే చిన్న చిన్న సంఘటనలు గతంలో జరిగాయి. తాజా హత్యతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. లోహిత్ కుటుంబం మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బంధువులు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.