Vijay Antony: ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలను ఖండించారు. ప్రస్తుతం తనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన లేదని, ఆ దిశగా ఎలాంటి ఆలోచనలూ లేవని తెలిపారు. బుధవారం ‘మార్గన్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“నటులు అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ప్రజాసేవ చేయాలనే నిశ్చయంతో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఉంటే, ముందుగా ప్రజల మద్దతు రావాలి. ఫేమ్ ఉన్నందుకే రాజకీయాల్లోకి వెళ్లడం సరికాదు. ప్రజల సమస్యలు బాగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. నాకు ఇంకా ఆ స్థాయి అవగాహన లేదు,” అని విజయ్ ఆంటోనీ వివరించారు
అదే సమయంలో, మాదకద్రవ్యాల కేసులో నటుడు శ్రీకాంత్ అరెస్ట్‌పై కూడా ఆయన స్పందించారు. డ్రగ్స్ వాడకం సినీ పరిశ్రమలో కొత్త విషయం కాదని పేర్కొన్నారు. “చాలామంది నటులు, కళాకారులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. శ్రీకాంత్ కేసు దర్యాప్తు దశలో ఉంది. నిజాలు త్వరలోనే బయటపడతాయి,” అని అన్నారు.
విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్‌పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్ ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో సముద్రఖని, దీప్షిక వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.