VC Sajjanar: కొత్త ఏడాది వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. బుధవారం రోజున పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈవెంట్లు నిర్వహించేవారు అర్ధరాత్రి 1 గంట వరకే వేడుకలు ముగించాలని, ఆ సమయం దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శబ్ద కాలుష్యం కలిగించే భారీ సౌండ్ సిస్టమ్స్ విషయంలో కూడా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
మద్యం విక్రయాల విషయంలో సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైన్ షాపులు, బార్లు మూసివేసిన తర్వాత కూడా దొడ్డిదారిన మద్యం అమ్మితే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత జోరుగా బైకులు నడుపుతూ ప్రమాదాలకు గురికావొద్దని, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా కొత్త ఏడాదికి స్వాగతం పలకాలని ఆయన కోరారు.
ముఖ్యంగా ఈసారి ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలను పోలీసులు మరింత ముమ్మరం చేశారు. నగరం నలుమూలలా దాదాపు 120 ప్రధాన ప్రాంతాలలో బుధవారం రాత్రి 7 గంటల నుంచే తనిఖీలు మొదలవుతున్నాయి. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడం, వాహనాలను సీజ్ చేయడం వంటి కఠిన చర్యలు ఉంటాయి. ఈ స్పెషల్ డ్రైవ్ జనవరి మొదటి వారం వరకు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.
మద్యం సేవించిన వారు స్వయంగా డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ లేదా ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే, ఇదే అదునుగా భావించి క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా డ్రైవర్ రైడ్‌కు రావడానికి నిరాకరించినా లేదా అదనపు డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే 94906 16555 అనే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కేవలం నిబంధనలే కాకుండా సామాజిక బాధ్యతపై కూడా సీపీ సజ్జనార్ మంచి పిలుపునిచ్చారు. పోలీస్ అధికారులు తమ పరిధిలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి వారితో వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఆపదలో ఉన్న వారికి, తోడు లేని వారికి సాయం చేయడమే నిజమైన పండుగ అని ఆయన సందేశం ఇచ్చారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌తో పాటు ఇతర డీసీపీలు పాల్గొని భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
