VasamShetty subash: దళిత యువకుడిపై తన అనుచరులు దాడి చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల అమలాపురంలో చోటుచేసుకున్న ఘటనను వివరించారు. కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసం చేశారని, ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులునే వారి మీదే దాడి చేశారన్నారు.
ఈ దాడికి తన అనుచరులను జోడిస్తూ వైసీపీ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. “నా అనుచరులు అంటే నా వెంట తిరిగిన వారా..? ఎప్పుడైనా నా కారు ఎక్కారా..?” అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో అవసరం లేని విషయాలు ట్రోల్ చేస్తున్నారని, అది ఏకపక్ష దుష్ప్రచారం అని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం దాచిన మద్యం తాగి మాట్లాడుతున్నట్టుగా వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారు.
సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా స్పష్టతతో ఉన్నదని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతుండగా, త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయనున్నట్టు తెలిపారు. అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, దీనివల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని వివరించారు.