Uttam Kumar Reddy: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంలో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హరీశ్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారంగా ఉంటూ, ప్రజలను దారి తప్పించేందుకు చేసిన రాజకీయ వ్యాఖ్యలుగా అభివర్ణించారు.
ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మౌనం వహించలేదని, చట్టబద్ధంగా తమ ఆందోళనను వ్యక్తీకరిస్తూ కేంద్ర మంత్రులకు ఇప్పటికే లేఖలు రాసినట్లు మంత్రి తెలిపారు. “ఈ ఏడాది జనవరి 22న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి గార్లకు స్వయంగా లేఖలు పంపించి మా అభ్యంతరాలు వివరించాం. పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తున్నాం,” అని ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్ర జలాల హక్కులకు నష్టాన్ని తెచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. “కృష్ణా నదిలో తెలంగాణ వాటాను కేవలం 299 టీఎంసీలకు పరిమితం చేశారు. అదే సమయంలో ముచ్చుమర్రి, మాల్యాల ప్రాజెక్టుల నుంచి ఏపీకి నీటిని తరలించడానికి అనుమతించారు. అప్పట్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో అపెక్స్ కౌన్సిల్‌ను ఎందుకు సంప్రదించలేదు?” అని మంత్రి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజూ మూడు టీఎంసీల నీటిని తరలిస్తుండగా, అప్పటి సీఎం కేసీఆర్ దీనిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. “జగన్ మరియు కేసీఆర్‌ల మధ్య నీకొన్న అవగాహన వల్లే తెలంగాణకు రావాల్సిన నీరు ఏపీకి వెళ్లిపోయింది,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
హరీశ్ రావు ఆరోపణల్లో కాస్తైనా నిజం లేదని స్పష్టం చేసిన మంత్రి, అవి పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేయబడినవేనని తెలిపారు. “ప్రజల మద్దతు కోల్పోతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఈ విధమైన అసత్య ప్రచారాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు,” అని ఆయన ఎద్దేవా చేశారు.