USA: అమెరికా రాజకీయ వర్గాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఈ పరిణామం, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. ప్రముఖ టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆయనకు సన్నిహితుడిగా పేరున్న జేర్డ్ ఐజాక్‌మెన్‌పై ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారు.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ట్రంప్ నిర్వహించిన నియామకాలలో, జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నాసా చీఫ్‌గా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా ఆ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. ఐజాక్‌మెన్‌కు గతంలో కొన్ని సంస్థలతో ఉన్న సంబంధాలను గమనించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. త్వరలోనే నాసాకు కొత్త చీఫ్‌ను ప్రకటిస్తామని చెప్పారు.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన ఏర్పాటైన ‘‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిఫికేషన్ అండ్ ఎఫిషియెన్సీ (DOJE)’’ బాధ్యతలను మస్క్‌కు అప్పగించారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించడమే ఈ శాఖ లక్ష్యం. అయితే ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన ‘‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’’ కు వ్యతిరేకంగా మస్క్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై తన అభిప్రాయానికి అనుగుణంగా స్పందించకపోవడమే తన వైదొలగడానికి కారణమని మీడియాలో కథనాలు వచ్చాయి.
Also Read: BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా!
ఐజాక్‌మెన్ – మస్క్ స్నేహితుడు, ప్రైవేట్ వ్యోమగామి
జేర్డ్ ఐజాక్‌మెన్ కు ఎలాన్ మస్క్‌తో అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. 2021లో స్పేస్‌ఎక్స్ సంస్థ ద్వారా మొదటి ప్రైవేట్ వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా, స్పేస్‌వాక్‌లో పాల్గొన్న తొలి ప్రైవేట్ వ్యోమగామిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. షిఫ్ట్4 (Shift4) అనే క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ కంపెనీకి ఐజాక్‌మెన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
ఈ పరిణామాలపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. “మేధాశక్తి, మంచి మనసు ఉన్నవారిని వెతికిపట్టుకోవడం చాలా అరుదు” అని ఆయన అన్నారు. అయితే ఇది నేరుగా ట్రంప్ నిర్ణయం గురించి అన్నా, లేక ఐజాక్‌మెన్‌కు మద్దతుగా అన్నా స్పష్టత ఇవ్వలేదు.
ఈ పరిణామాలు ట్రంప్ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాల్లో మద్దతుదారుల పాత్ర, సన్నిహితుల నియామకాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంతేగాక, మస్క్ వంటి ప్రముఖ వ్యక్తులు వైదొలగడం వల్ల ట్రంప్ పాలనపై ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఏర్పడనుంది అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.
