Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, బైడెన్ తన సంతానానికి అందించిన సీక్రెట్ సర్వీస్ రక్షణను వెంటనే తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.
బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ భద్రత కోసం 18 మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు విధులు నిర్వహిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అదే విధంగా, ఆష్లే బైడెన్ భద్రత కోసం 13 మంది ఏజెంట్లు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఈ రక్షణను తొలగిస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా, బైడెన్ కార్యాలయం దీనిపై ఇంకా స్పందించలేదు.
సాధారణంగా అమెరికాలో మాజీ అధ్యక్షుడు వారి జీవిత భాగస్వామికి జీవితకాలం సీక్రెట్ సర్వీస్ రక్షణ లభిస్తుంద. అయితే, వారి పిల్లలకు 16 ఏళ్లు నిండిన తర్వాత భద్రత కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయం కొత్త అధ్యక్షుడి అధికార పరిధిలో ఉంటుంది. అయితే, బైడెన్ తన పదవి ముగిసే ముందు జులై వరకు తన పిల్లలకు భద్రత పొడిగిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదే విధంగా, ట్రంప్ తన తొలిసారి పాలనలో ఉన్నప్పుడు తన పిల్లలకు రక్షణ కల్పించే నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ట్రంప్ బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Shyamala: వైసీపీ శ్యామలకు ‘బెట్టింగ్’ ఉచ్చు
Donald Trump: ఇదే తరహాలో, బైడెన్ ఇచ్చిన క్షమాభిక్షల విషయంలోనూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ పదవి వీడే కొన్ని గంటల ముందు 1500 మందికి శిక్షలలో సడలింపు ఇచ్చి, 39 మందికి పూర్తిగా క్షమాభిక్షను ప్రకటించారని పేర్కొన్నారు. అంతేకాకుండా, క్షమాభిక్ష పత్రాలపై బైడెన్ స్వయంగా సంతకం చేయలేదని, ఆటోపెన్ ద్వారా అవి ఖరారైనట్లు ట్రంప్ ఆరోపించారు. దీనిని కారణంగా చూపిస్తూ క్షమాభిక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఒకేరోజు ఇంత భారీ స్థాయిలో క్షమాభిక్షలు అందించిన అధ్యక్షుడు బైడెన్ మాత్రమే అని విశ్లేషకులు చెబుతున్నారు.