KK Survey: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్ సర్వేతో నూటికి 97 శాతం ఫలితాల సాధనతో 100 మార్కులు కొట్టేసి సంచలనం నమోదు చేసిన కేకే సర్వే సంస్థ.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ సెపరేట్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏ సర్వే సంస్థకూ అందని ఫలితాలను అంచనా వేసి అందరి నోళ్లలో నానింది. ఏపీ ఓటర్ల నాడిని ఏ ఒక్క సంస్థ సరిగా పట్టలేకపోగా, కేకే సర్వే సంస్థ మాత్రం ఓటర్ల నాడిని పసిగట్టి సరైన అంచనా వేయగలిగింది. హర్యానాలో ఆ సంస్థ సర్వే బోల్తాకొట్టినా, తాజా ఎన్నికల్లో అంచనా చర్చనీయాంశంగా మారింది.
KK Survey: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సర్వే సంస్థలు బీజేపీ నాయకత్వంలోని కూటములే విజయం సాధిస్తాయని అంచనా వేశాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి కూటమి విజయం ఖాయమని దాదాపు అన్ని సంస్థలూ అంచనా వేశాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌పీ)ల మహా వికాస్ అఘాడీ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఒక్క లోక్‌పాల్ సంస్థ అంచనా వేసింది.
KK Survey: జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి బొటాబొటిగా అయినా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రం జేఎంఎం కూటమి గెలుపొందుతుందని అంచనా వేసింది. ఒక దశలో హంగ్ వచ్చినా రావచ్చని కొన్ని సంస్థలు వెలువర్చాయి. అన్ని సంస్థల సర్వే ఫలితాలు ఈ విధంగా ఉంటే కేకే సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రం వీటికి దూరంగా ఉండటమే చర్చనీయాంశానికి దారితీసింది.
KK Survey: మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు గాను బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధిస్తుందని కేకే సర్వే సంస్థ ఎవరికీ అందని అంచనా వేసింది. ఆ కూటమి ఏకంగా 225 సీట్లను గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పి సంచలనం రేకెత్తించింది. మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 56 స్థానాలకే పరిమితం అవుతుందని కేకే సర్వే సంస్థ తేల్చి చెప్పింది. ఇతరులు 7 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది.
KK Survey: ఎగ్జిట్‌పోల్ సర్వే చేసిన ఇతర సంస్థలు మహాయుతి కూటమే విజయం సాధిస్తుందని చెప్పినా ఇంత భారీ విజయం వరిస్తుందని మాత్రం ఏ ఒక్క సంస్థ కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఓటరు నాడిని బట్టి ఏ కూటమి గెలుస్తుంది.. మెజారిటీ సంస్థలు చెప్పినట్టు బీజేపీ కూటమికి సాధారణ మెజారిటీ చేకూరుతుందా? అందరి అంచనాలు కాదని కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందా? మరి కేకే సర్వే సంస్థ అంచనా వేసినట్టు బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంటుందా? లేదా హర్యానా ఎన్నికల మాదిరిగా కేకే సర్వే అంచనా తలకిందులవుతుందా? అన్నది శనివారం వెల్లడయ్యే ఫలితాల వరకూ వేచి చూడాలి.