Amaravati: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుంది. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించనున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న ఐదవ జిల్లా కలెక్టర్ల సమావేశం కావడం విశేషం. రాష్ట్ర అభివృద్ధి దిశగా అధికారులు మరింత స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని ఈ సమావేశం ద్వారా సూచనలు ఇవ్వనున్నారు.
Also Read: iBomma Ravi: ఐబొమ్మ ఇమ్మడి రవికి మరోసారి పోలీస్ కస్టడీ
ఈ సమావేశంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ అనేవి ప్రధాన అజెండాగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2029 – 2047 సంవత్సరాలకు లక్ష్యాలుగా పెట్టుకుంటూ, ప్రతి సంవత్సరం 15 శాతం వృద్ధి రేటు సాధించాలని పదేపదే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే భారీ లక్ష్యాన్ని జిల్లాల వారీగా నిర్దేశించి, ఆ లక్ష్యాలను చేరుకునే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించనున్నారు.
పెట్టుబడుల పరంగా కూడా జిల్లా స్థాయిలో స్పష్టమైన లక్ష్యాలు నిర్ణయించనున్నారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సులు, అలాగే ఇప్పటివరకు జరిగిన 13 రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాల్లో ఆమోదం పొందిన సుమారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు క్షేత్ర స్థాయిలో అమలవ్వాలనే ఉద్దేశంతో కలెక్టర్ల పాత్రను మరింత బలపరచనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ జిల్లా కలెక్టర్ల సదస్సు ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
