Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నారు. ఇప్పటికే వెనిజులాపై సైనిక చర్య చేపట్టి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ట్రంప్, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రీన్‌లాండ్‌ను ప్రకటించారు. అమెరికా రక్షణ కోసం గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతి విషయంలో కూడా ఒక వివాదం నెలకొంది. వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో తనకు ఇచ్చిన నోబెల్ బహుమతిని కమిటీ నిబంధనల ప్రకారం బదిలీ చేయడానికి నిరాకరించడంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్వే ప్రధానికి రాసిన లేఖలో “నేనిక శాంతికి కట్టుబడి లేను, అమెరికా ప్రయోజనాలే నాకు ముఖ్యం” అని తెగేసి చెప్పారు. గ్రీన్‌లాండ్‌ను రష్యా, చైనా బారి నుండి కాపాడటంలో డెన్మార్క్ విఫలమైందని, అందుకే ఆ ప్రాంతాన్ని తామే స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Renu Desai: ఐదు కుక్కలు కరిస్తే, అన్ని కుక్కలను చంపేస్తారా?
గ్రీన్‌లాండ్ విషయంలో తనకు అడ్డు తగులుతున్న యూరోపియన్ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించారు. ఫిబ్రవరి 1, 2026 నుండి డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తామని, జూన్ నాటికి దానిని 25 శాతానికి పెంచుతామని బాంబు పేల్చారు. ఒకవేళ శాంతియుతంగా ఒప్పందం కుదరకపోతే బలవంతంగానైనా గ్రీన్‌లాండ్‌ను తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశాయి.
ట్రంప్ నిర్ణయాలపై యూరోపియన్ దేశాలు మరియు నాటో దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ట్రంప్ తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బ్రస్సెల్స్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అమెరికా కంపెనీలను తమ మార్కెట్ నుంచి తొలగించడమే కాకుండా, అమెరికాపై భారీగా సుంకాలు విధించేందుకు ఫ్రాన్స్ వంటి దేశాలు సిద్ధమవుతున్నాయి. గ్రీన్‌లాండ్ అంశం ఇప్పుడు అమెరికా మరియు యూరోపియన్ దేశాల మధ్య ఒక పెద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది.
