Trainee IPS Officer: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు, హత్యాయత్నం, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఉప్పరపల్లి న్యాయస్థానం, పోలీసుల విజ్ఞప్తి మేరకు నిందితుడిని మరో రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు విధించిన కీలక షరతులు:
గత విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసే ధోరణి ప్రదర్శించడంతో మరింత సమాచారం రాబట్టేందుకు అత్తాపూర్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు విచారించేందుకు అనుమతిస్తూ కొన్ని షరతులు విధించింది..
-
విచారణ సమయం: ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య మాత్రమే విచారణ జరపాలి.
-
న్యాయవాది సమక్షం: విచారణ ప్రక్రియను న్యాయవాది సమక్షంలోనే నిర్వహించాలని, నిందితుడిని ఎలాంటి శారీరక, మానసిక ఒత్తిడికి గురిచేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
-
జైలు నుంచి తరలింపు: కస్టడీ నిమిత్తం ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు.
పొటెన్షియల్ టెస్ట్‌కు అనుమతి – శాస్త్రీయ ఆధారాల సేకరణ..
ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా నిందితుడికి పొటెన్షియల్ టెస్ట్ (లైంగిక సామర్థ్య పరీక్ష) నిర్వహించేందుకు కూడా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, శాస్త్రీయంగా ఆధారాలను రుజువు చేసేందుకు ఈ వైద్య పరీక్ష దర్యాప్తులో అత్యంత కీలకం కానుంది. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ (Women Safety Wing) డీసీపీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అన్ని కోణాల్లో పక్కా ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేసింది.
