Nagar Kurnool: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే తన బిడ్డలకు విషం పెట్టి, తాను కూడా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త మరణాన్ని తట్టుకోలేక, ఒంటరితనాన్ని భరించలేక ఓ ఇల్లాలు తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌కు చెందిన భీమ్‌శెట్టి ప్రకాశ్, ప్రసన్న దంపతులు కల్వకుర్తిలో నివసిస్తూ పుస్తకాల దుకాణం నడుపుతూ జీవనం సాగించేవారు. అయితే 2025 నవంబరు 14న ప్రకాశ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
భర్త మరణించినప్పటి నుండి ప్రసన్న తీవ్ర మానసిక వేదనలో కూరుకుపోయింది. తన పిల్లలు మేఘన, ఆశ్రిత్‌రామ్‌లను తండ్రి లేకుండా ఎలా పెంచాలనే ఆందోళన ఆమెను నిరంతరం వేధించింది. ఈ క్రమంలోనే మానసిక డిప్రెషన్ గురైన ఆమె, ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు పిల్లల ఆహారంలో విషం కలిపి తినిపించి, అనంతరం తాను కూడా అదే ఆహారాన్ని తిన్నది. ఆ తర్వాత కొద్దిసేపటికే అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
Also Read: Nandyal: నంద్యాల జిల్లాలో విషాదం: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య!
బయటకు వెళ్లిన ప్రసన్న తమ్ముడు చక్రధర్ ఇంటికి తిరిగి వచ్చి తలుపు తట్టగా ఎంతకూ తీయకపోవడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూశాడు. అక్కడ అప్పటికే ముగ్గురూ వాంతులు చేసుకుని స్పృహ లేకుండా పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే వారిని చికిత్స కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి చేరేలోపే 13 ఏళ్ల కుమార్తె మేఘన ప్రాణాలు విడిచింది. తల్లి ప్రసన్న పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మరణించింది.
కుమారుడు ఆశ్రిత్‌రామ్ ప్రస్తుతం కల్వకుర్తిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసన్న రాసిన నాలుగు పేజీల ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తన ఆవేదనను, భర్త లేని లోటును ఆమె వివరించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చేతికి అందివచ్చిన బిడ్డలను సాకాల్సిన తల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్టణవాసులను కన్నీటిపర్యంతం చేస్తోంది.
