Mahesh Goud: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం, కుల సర్వే నిర్వహించడం వంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్‌గౌడ్ మాట్లాడుతూ, బీసీలకు ఇంత గొప్ప అవకాశం వస్తే కేసీఆర్ కనీసం అభినందించే పరిస్థితిలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“బీసీలకు ఇంత మేలు జరిగే నిర్ణయంపై కూడా కేసీఆర్ నోరు విప్పడం లేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి ఆలోచించని కేసీఆర్, ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తూ విషం చిమ్ముతున్నారని” మహేష్‌గౌడ్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ తీరు “కడుపు నిండా విషం పెట్టుకొని కౌగిలించుకున్నట్లుగా” ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: KA Paul: నా కొడుకుని అమెరికా అధ్యక్షుడిని చేస్తా
బీసీ రిజర్వేషన్ల పెంపును కవిత తన విజయంగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని మహేష్‌గౌడ్ ఎద్దేవా చేశారు. “మేము రిజర్వేషన్లపై కసరత్తు ప్రారంభించినప్పుడు కవిత జైల్లో ఉన్నారు. తిహాడ్ జైలులో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు. కవిత మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని, ఆమె ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా అని ప్రశ్నించారు.
“మేం ఆర్డినెన్స్ తెస్తే కవిత సంబరాలు ఏంటి?” అని ప్రశ్నించిన మహేష్‌గౌడ్, బీఆర్‌ఎస్‌లో “దెయ్యాలు ఎవరు, ఏమయ్యారు” అనేది కూడా అర్థం కావడం లేదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే, ప్రతిపక్షాలు వాటిని అభినందించకుండా అనుమానాలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.