Narsingi

Narsingi: 4లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన టౌన్ ప్లాన్ ఆఫీసర్

Narsingi: నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టౌన్ ప్లానింగ్ అధికారిణి హారిక రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ప్లాట్‌కు అనుమతులు ఇవ్వడానికి ఆమె లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

లంచం డిమాండ్, పట్టుబడిన వైనం
మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) క్లియర్ చేయడానికి హారిక రూ. 10 లక్షలు లంచం అడిగింది. ఈరోజు (మంగళవారం) మొదటి విడతగా రూ. 4 లక్షలు తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం హారికను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

అవినీతికి అడ్డాగా మున్సిపాలిటీలు
ఏసీబీ రిపోర్టుల ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ మరియు దాని పరిసర మున్సిపాలిటీలు అవినీతికి కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీగా అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి అధికారులు కావాలనే ఆలస్యం చేసి, మధ్యవర్తుల ద్వారా లంచం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణాన్ని బట్టి లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

మహిళా అధికారుల అవినీతి
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిలో 20 మందికి పైగా మహిళా అధికారులే ఉండటం గమనార్హం. గత వారం నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మత్స్య శాఖ అధికారిణి ఎం. చరిత రెడ్డి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వరుస సంఘటనలు ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతిని కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *