TOLLYWOOD: తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు సినీ రంగ ప్రముఖులు శుక్రవారం ఉదయం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. నగరంలోని దొండపర్తిలో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాతలు స్రవంతి రవికిశోర్, సి. కల్యాణ్, సుధాకర్ రెడ్డి, భరత్ భూషణ్ తదితరులు హాజరయ్యారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాత సి. కల్యాణ్, సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, ఆదాయ పంపిణీలోని పర్సంటేజీల విధానం వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించామని ఆయన తెలిపారు.
ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సి. కల్యాణ్ వెల్లడించారు. “నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్ల సంఘం, ఎగ్జిబిటర్ల సంఘం నుంచి తొమ్మిది మంది చొప్పున మొత్తం 27 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం,” అని ఆయన చెప్పారు. కమిటీలోని సభ్యుల పేర్లను ముందుగా ప్రభుత్వానికి తెలియజేస్తామని, అనంతరం సోమవారం మీడియాకు పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
థియేటర్ల నిర్వహణ, ఆదాయ పంపిణీ విధానంలో ఉన్న అసమతుల్యతలతో పాటు, సినిమా హాళ్లలో జరుగుతున్న తనిఖీల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించామని కల్యాణ్ తెలిపారు. తనిఖీలు సాధారణ ప్రక్రియలో భాగమేనని, వాటిలో అసాధారణం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు.
ఈ కమిటీ ఏర్పాటుతో పరిశ్రమలోని పలు సమస్యలకు త్వరలోనే సమర్థవంతమైన పరిష్కారం లభించే అవకాశం ఉందని కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


