Tollywood: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ మరోసారి తెరపై కనిపించబోతోందన్న వార్తలు ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఈ హిట్ కాంబో నాలుగోసారి కలిసి పని చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ వంటి భారీ విజయాలను అందించిన ఈ జోడీ, ఈసారి మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను ఓ గ్రాండ్ పౌరాణిక చిత్రంగా రూపొందించనున్నారని టాక్.
మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్‌తో మళ్లీ సినిమా చేయబోతున్నారన్న వార్తలు రావడంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా పౌరాణిక కథాంశం నేపథ్యంలో బన్నీ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది.
అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లేదా నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మొత్తం ఊహాగానాలేనని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ప్రాజెక్ట్ ఖరారైతే 2027 ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొన్ని కథనాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ బాలీవుడ్ దర్శకుడు అట్లీతో ‘AAA’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్‌తో బన్నీ బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వెయ్యి కోట్ల పౌరాణిక చిత్రం నిజమైతే, ఇది టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు మాత్రం ఆసక్తితో ఎదురుచూడాల్సిందే.
