Tirupati: తిరుపతిలో తీవ్ర కలకలం రేగింది. రుయా ఆసుపత్రి డైరెక్టర్, జనసేన పార్టీ క్రియాశీలక నేత లక్ష్మీపతి రాయల్పై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. సిమ్స్ ఆసుపత్రి పరిసర ప్రాంతంలో ఆయన వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై దాడికి తెగబడ్డారు. దాడి సమయంలో దుండగులు ఆయన ఛాతీ భాగంలో బలంగా కొట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన, కళ్లు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
లక్ష్మీపతి రాయల్ పరిస్థితి విషమించడంతో వెంటనే అప్రమత్తమైన ఆయన అనుచరులు హుటాహుటిన సమీపంలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే కారణంతోనే రాజకీయ కక్షతో పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డారని ఆయన అనుచరులు, కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తూ, దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
