Tirumala : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు (ఫిబ్రవరి 26) సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండవ రోజు (ఫిబ్రవరి 27) రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను కనువిందు చేస్తారు.
మూడవ రోజు నుండి మలయప్పస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పోత్సవాల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 28న మూడు సార్లు, మార్చి 1న ఐదు సార్లు, చివరి రోజైన మార్చి 2న ఏడు సార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ ఉత్సవాల కారణంగా ఫిబ్రవరి 26 నుండి మార్చి 2 వరకు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సహస్రదీపాలంకార సేవతో పాటు, ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు కూడా రద్దు అయ్యాయి.
మరోవైపు, శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన సాయి సిద్ధార్థ్ ఎంటర్‌ప్రైజర్స్ సంస్థ భారీ విరాళాన్ని అందించింది. సోమవారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును కలిసి రూ.10.51 లక్షల డిడిని అందజేశారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
