Tholi Ekadashi 2026: ప్రస్తుతం పవిత్రమైన ఆషాఢ మాసం కొనసాగుతోంది. వారాహి నవరాత్రి ఉత్సవాల ముగింపు తర్వాత వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశినే మనమంతా ‘తొలి ఏకాదశి’ (దేవశయని ఏకాదశి) గా జరుపుకుంటాం. హిందూ సంప్రదాయంలో ఈ పండుగకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది.
పురాణాల ప్రకారం ఈ తొలి ఏకాదశి నాటి నుంచే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీరాబ్ధిలో యోగ నిద్రలోకి వెళ్తారు. అందుకే ఈ నాలుగు నెలల కాలాన్ని ‘చాతుర్మాసం’ అంటారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకుండా పూర్తి సమయం భగవంతుని ఆరాధనకే కేటాయిస్తారు.
దేవశయని (తొలి) ఏకాదశి 2026 తేదీ & ముహూర్తాలు
తిథి వివరాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి జులై 24న ప్రారంభమైనప్పటికీ.. ఉదయ తిథి (సూర్యోదయ తిథి) ప్రామాణికంగా 2026 జులై 25, శనివారం నాడు తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటారు.
-
ఏకాదశి తిథి ప్రారంభం: జులై 24 (శుక్రవారం) ఉదయం 10:08 గంటలకు
-
ఏకాదశి తిథి ముగింపు: జులై 25 (శనివారం) ఉదయం 11:54 గంటలకు
-
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:16 నుండి 04:57 గంటల వరకు
-
పూజా ముహూర్తం: ఉదయం 07:21 నుండి 09:03 గంటల వరకు
-
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:00 నుండి 12:55 గంటల వరకు
-
ఉపవాస విరమణ (పారణ): జులై 26న తెల్లవారుజామున 05:38 నుండి ఉదయం 08:22 గంటల వరకు
తొలి ఏకాదశి నాడు ఏమి చేయాలి?
-
పరిశుభ్రత: ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
-
పూజా విధానం: విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవికి పసుపు పువ్వులు, తులసి దళాలతో పూజలు చేసి, ప్రసాదం సమర్పించాలి. విష్ణువు పూజలో తులసి ఆకులు అత్యంత ప్రధానం.
-
ఉపవాస దీక్ష: ‘ఏకాదశి వ్రతం’ ఆచరిస్తామని సంకల్పం చెప్పుకుని రోజంతా ఉపవాసం లేదా ఫలహారం తీసుకోవాలి.
-
దానధర్మాలు: ఈ పవిత్ర దినాన పేదలకు ధాన్యం, వస్త్రాలు, పానకం లేదా ధనం దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది.
ఈ రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు (నియమాలు)..
-
అన్నం తినకూడదు: ఏకాదశి రోజున అన్నం (బియ్యంతో చేసిన ఆహారం) అస్సలు తీసుకోకూడదు. తామసిక ఆహారం, మద్యం, మాంసానికి పూర్తిగా దూరంగా ఉండాలి.
-
తులసి ఆకులు కోయవద్దు: ఏకాదశి రోజున తులసి మొక్క నుండి ఆకులను తెంపకూడదు. పూజ కోసం ముందు రోజే ఆకులను కోసి ఉంచుకోవాలి.
-
తలస్నానం & క్షౌరం వద్దు: ఈ రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదని, అలాగే పురుషులు గోళ్లు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదని పండితులు చెబుతారు.
-
సంయమనం: బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీలను, పెద్దలను అవమానించడం లేదా మనసులో ఇతరుల పట్ల చెడు ఆలోచనలు రానీయకూడదు.
శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోయి, జీవితంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు సిద్ధించాలని ఆకాక్షిస్తూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
