Best Actor: వర్క్ హాలిక్ అనే పదం తరచూ వింటుంటాం. చాలా ఇండస్ట్రీలలో చూస్తుంటాం కూడా. ఒక్కొక్కరు ఎంతగా తమ పనిలో మునిగిపోతారంటే.. దానికోసం ఇల్లు.. ఒళ్ళు ఏదీ తెలియదు. ఎప్పుడు తింటారో.. ఎప్పుడు పాడుకుంటారో కూడా అర్ధం కానీ విధంగా వారు పనులను చక్కపెడుతూ పోతారు. విశ్రాంతి విరామం వారి డిక్షనరీలోనే లేవేమో అనేంతగా కష్టపడతారు. కెరీర్ బిల్డప్ చేసుకుంటారు. అయితే, సినిమాల్లో కూడా అలా పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాల్షీట్స్ వరుసగా ఉండి.. రోజుకు మూడు షిఫ్తుల్లో పనిచేసిన నటులు చాలామందే ఉన్నారు. కానీ, వారిలో హీరోలుగా నటించిన వారు చాలా తక్కువ మంది. సహనటులుగా.. కామెడియన్లుగా నటించిన వారే ఇలా రాత్రి పగలు తేడా లేకుండా నటించడం జరుగుతూ వస్తుంది.
ఇక అప్పట్లో, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కొన్ని రోజులు రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్స్ లో మునిగి తేలిపోయారనే సంగతి తెలిసిందే. ఈ లిస్టులో టాప్ స్టార్ ఒకరు ఉన్నారు. ఆయన టాలీవుడ్ కాకపోయినా.. మనకి కూడా బాగా పరిచయం ఉన్న హీరో. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ మన దగ్గర కూడా ఉంది. ఆయనెవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. తెలుగులో టాప్ హీరోలు అందరూ కూడా దాదాపుగా తమ ఫాన్స్ కోసం.. ప్రజల కోసం మాస్ సినిమాల బాటలోనే ప్రయాణించేవారు. కానీ, మమ్ముట్టి మాత్రం వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ, మమ్ముట్టి గురించి తెలియని మరో పెద్ద విషయం కూడా ఒకటి ఉంది.
ఇది కూడా చదవండి: Naga Chaitanya: ‘విరూపాక్ష’ దర్శకుడితో నాగ చైతన్య చిత్రం
Best Actor: మమ్ముట్టి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన వయసు ఇప్పుడు 73 ఏళ్ళు. ఈయన సినీ కెరీర్ 50 ఏళ్ల పైమాటే. ఈయన మొత్తం ఇప్పటివరకూ ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? మొత్తం 433. వాటిలో 396 మలయాళ సినిమాలు. తమిళంలో 16, తెలుగులో 6, హిందీలో 5, మిగిలిన భాషల్లో రెండు సినిమాలను చేశారు మమ్ముట్టి. అయితే, ఈయన కెరీర్ పీక్స్ లో ఉండగా నాలుగేళ్లలో 139 సినిమాల్లో నటించారనేదే ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం. అంటే సంవత్సరానికి ఏవరేజ్ గా 33 సినిమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోయారు. సంవత్సరానికి 33 సినిమాలు.. అంటే నెలకు మూడు సినిమాలు.. ఇలా లెక్కవేసుకుంటే ప్రతి 10 రోజులకు ఒక సినిమా చేశారు. అలా అని ఎదో సినిమాలు చేసేశారు అని అనుకోవడానికి లేదు. మమ్ముట్టి నటుడిగా జాతీయస్థాయిలో టాప్ పెర్ఫార్మర్ అనేది అందరికీ తెలిసిందే. 1983 నుంచి 86 వరకూ తన తిండి, నిద్ర అన్నీ సినిమా షూటింగుల్లోనే గడిచిపోయాయి. 1983లో 36 సినిమాల్లో నటించిన మమ్ముట్టి.. తరువాత వరుసగా 84లో 34, 85లో 34, 86లో 35 సినిమాల్లో కనిపించారు. బహుశా ప్రపంచ సినిమాలోనే ఈ ఘనత మరెవరికీ ఉంది ఉండదు.
ఇక మమ్ముట్టి నటనకు దక్కిన అవార్డులు తక్కువేమీ కాదు. ఉత్తమ నటుడిగా ఏకంగా మూడుసార్లు నేషనల్ అవార్డు గెలిచారు. అంతేకాదు ఫిలింఫేర్ అవార్డులను 15 తన ఎకౌంట్ లో వేసుకున్నారు. ఇక చిన్నా.. చితకా అవార్డుల లిస్ట్ చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. ఇప్పుడు ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమా చేయడమే గగనంగా మారిపోయింది. ఇప్పటికీ మమ్ముట్టి ఇంకా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అదండీ మమ్ముట్టి రికార్డ్. ఇది బద్దలు కొట్టడం ఏ హీరోకూ సాధ్యం కాదు అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. అన్నట్టు ఇన్నీ చెప్పి ఆయన కొడుకు దుల్కర్ సల్మన్ గురించి కూడా కాస్త చెప్పుకుంటే బావుంటుంది కదూ. తండ్రి ఇమేజ్ తనమీద పడకుండా.. ప్రత్యేకంగా తనదారిలో తానూ నటిస్తూ ముందుకు సాగుతున్నారు దుల్కర్ సల్మన్. ఈమధ్యనే లక్కీ భాస్కర్ అంటూ బాక్సాఫీస్ ను షేక్ చేసిన దుల్కర్ సల్మన్ తన 13 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇప్పటివరకూ 36 సినిమాలు చేశారు. మమ్ముట్టి నట వారసుడిగా విభిన్న కథలు ఎంచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు దుల్కర్ సల్మన్.