KTR

KTR: కుమ్మెర ఘటనపై కేటీఆర్ ఆగ్రహం.. నిందితులు ఏ పార్టీ వారైనా వదలొద్దు

KTR: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే, ప్రభుత్వం వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్, నాగర్‌కర్నూల్‌లోని అంబేడ్కర్ కూడలిలో గ్రామస్థులు చేపట్టిన నిరసనలో పాల్గొని తన మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సమాజం తలదించుకోవాల్సిన ఘటన ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పసిగుడ్డుకు కులం అంటే ఏంటో తెలుసా? మతం అంటే ఏంటో తెలుసా? అంత చిన్నారిని పొట్టనబెట్టుకోవడానికి మనసు ఎలా వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. నేటి కాలంలో కూడా కులం పేరుతో ఇలాంటి దాడులు జరగడం అత్యంత విచారకరమని, ఇది తెలంగాణలో పెరుగుతున్న హత్యా రాజకీయాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎనిమిది మందిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. తప్పు చేసిన వారికి ఏ రాజకీయ నాయకుడు కూడా అండగా నిలవకూడదని, వారిని కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన అధికారులను కోరారు.

చివరగా, చిన్నారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం ప్రకటించాలని, అలాగే ఆ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *