38th National Games: ఉత్తరాఖండ్ లో జరిగిన 38వ జాతీయ క్రీడలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులు రెండు తెలుగు రాష్ట్రాలకు పతకాల పంట పండించారు.
ఈ జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. చివరి రోజు తెలంగాణ రెండు కాంస్య పతకాలు సాధించింది. షూటింగ్, నెట్‌బాల్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. షాట్‌గన్ స్కీట్ మిక్స్డ్ విభాగంలో బత్తుల మునెక్, రష్మీ రాఠోడ్ జంట కాంస్య పతకం గెలుచుకున్నారు. మిక్స్డ్ నెట్ బాల్ లో తెలంగాణ మరో కాంస్య పతకాన్ని సాధించింది.
మొత్తంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ 12 పతకాలు గెలుచుకుంది, అందులో 7 బంగారం, 1 వెండి, 6 కాంస్య పతకాలు ఉన్నాయి, 18వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 3 బంగారు, 3 వెండి, 12 కాంస్య పతకాలు సాధించి, మొత్తం 18 పతకాలతో 26వ స్థానంలో ఉంది.
Also Read: Madanapalle: అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి
ఇక ఈ నేషనల్ గేమ్స్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన రాష్ట్రాలు మరియు జట్ల విషయానికి వస్తే… సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ మొదటి స్థానంలో, 121 పతకాలతో, 68 బంగారు, 26 వెండి, 27 కాంస్య పతకాలు గెలుచుకుని నిలిచింది. మహారాష్ట్ర 54 బంగారు, 71 వెండి, 73 కాంస్య పతకాలతో మొత్తం 198 పతకాలను సాధించి రెండో స్థానంలో నిలిచింది.
హరియాణా 48 బంగారు, 47 వెండి, 58 కాంస్య పతకాలతో మూడో స్థానంలో 153 పతకాలను సాధించింది. సర్వీసెస్ కన్నా మహారాష్ట్ర, హరియాణా ఎక్కువ పతకాలు గెలుచుకున్నప్పటికీ, వారు బంగారు పతకాలలో వెనుకబడి రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.