TGSRTC: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్న కీలక పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు గురువారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 198 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 84 పోస్టులు, మెకానికల్ విభాగంలో 114 పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారీ జీతభత్యాలు అందనున్నాయి. నెలకు కనీసం రూ.27,080 నుంచి గరిష్టంగా రూ.81,400 వరకు జీతంతో పాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా లభిస్తాయి. ట్రాఫిక్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మెకానికల్ సూపర్‌వైజర్ పోస్టులకు మాత్రం సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే, అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయని బోర్డు స్పష్టం చేసింది. రాత పరీక్ష, సిలబస్ మరియు ఇతర శారీరక సామర్థ్య పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30, 2025 ఉదయం 8 గంటల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 20, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు చివరి నిమిషంలో వచ్చే సర్వర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ముందుగానే అధికారిక వెబ్‌సైట్ సందర్శించి అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్టీసీలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని నిపుణులు చెబుతున్నారు.
