Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఏడాది ముగింపు కావడంతో పాటు వరుస సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని 9 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కృష్ణ తేజ సర్కిల్ నుండి అక్టోపస్ సర్కిల్ వరకు కిలోమీటర్ల మేర సాగుతున్నాయి.
రద్దీ సాధారణ స్థాయిని మించిపోవడంతో, సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం ఏకంగా 30 గంటల సమయం పడుతోంది. ఈ పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల భద్రత మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మధ్యాహ్నం 3 గంటల నుండి సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులను అనుమతించడం తాత్కాలికంగా నిలిపివేశారు. దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు రేపు ఉదయం 6 గంటల తర్వాతే తిరిగి క్యూలైన్ల వద్దకు రావాలని టీటీడీ సూచిస్తోంది.
కేవలం తిరుమల కొండ పైనే కాకుండా, కింద అలిపిరి వద్ద కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. అలిపిరిలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు వేల సంఖ్యలో ఎగబడటంతో టోకెన్లు దొరకక కొంత గందరగోళం నెలకొంది. వాహనాల తనిఖీ కేంద్రం వద్ద కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తలనీలాలు సమర్పించే చోట, వసతి గదుల కౌంటర్ల వద్ద మరియు లడ్డూ ప్రసాద కేంద్రాల వద్ద కూడా భక్తులు సుదీర్ఘ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.
మున్ముందు వైకుంఠ ద్వార దర్శనం కూడా ప్రారంభం కానుండటంతో ఈ రద్దీ మరో 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే భక్తులు ఈ రద్దీని గమనించి, తగిన జాగ్రత్తలతో రావాలని అధికారులు కోరుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులతో వచ్చే వారు మరింత ఓపికతో ఉండాలని సూచిస్తున్నారు.
