Test match: లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ధ్వంసం చేసి కేవలం 138 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధారంగా 74 పరుగుల ఆధిక్యం సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ మరోసారి బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ, చివరికి 207 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ముఖ్యంగా ఖవాజా (6), గ్రీన్ (0), స్మిత్ (13) వంటి కీలక ఆటగాళ్లు నిరాశపరిచారు. కానీ అలెక్స్ కేరీ (43), మిచెల్ స్టార్క్ (58 నాటౌట్)ల మధ్య జరిగిన కీలక భాగస్వామ్యం స్కోరును నిలబెట్టింది. మిగతా ఆటగాళ్లెవరూ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. లుంగీ ఎంగిడీ 3 వికెట్లు అందించాడు.
ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియా మొత్తం 281 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల భారీ లక్ష్యం ఉంది. అయితే ఆసీస్ బౌలింగ్ యాటాక్‌ను దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎదుర్కొనగలరా? లేక మళ్లీ తొలి ఇన్నింగ్స్ మాదిరిగా తడబడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

