Mulugu: ములుగు జిల్లా ఇప్పుడు టెన్షన్ టెన్షన్ గా మారింది. ఓ యువకుడి ఆత్మహత్య నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై ఒకటి విరుచుకుపడుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు పొందలేదనే కారణంగా రమేశ్ అనే యువకుడు సూసైడ్ చేసుకోవడంతో రాజకీయ రగడ మొదలైంది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునివ్వగా.. కాంగ్రెస్ పార్టీ ‘చలో ములుగు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో జిల్లా మొత్తంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రుల పర్యటన కూడా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులోకి తెచ్చారు. ఈ నెల 31 వరకు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు నిషేధం విధించారు. ఎవరు నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని ముందస్తు అరెస్టులు చేశారు. జిల్లా సరిహద్దుల దగ్గర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీలు చేస్తున్నారు.
రమేష్ ఆత్మహత్యకి కారణం
గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్కా రమేష్ (29) హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అధికారుల దగ్గర వెళ్ళినా ఉపయోగం లేకపోయింది.
ఇదే విషయంపై స్థానిక కాంగ్రెస్ నాయకులతో వాట్సాప్ గ్రూపులో వాగ్వాదం జరిగింది. దీంతో స్థానిక పోలీసులు వచ్చి రమేష్‌ను హెచ్చరించారు. గ్రామస్తులు అంటున్నట్లు అతని ఫోన్ కూడా పోలీసులు తీసుకెళ్లారని కథనాలు రావడం గమనార్హం. అయితే, పోలీసులు దీన్ని ఖండించారు.
అయితే గురువారం ఉదయం రమేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నాపై తప్పుడు కేసు పెట్టారు, మనస్తాపంతో చనిపోతున్నా.. అమ్మమ్మ, చిన్నమ్మలూ క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు.
మంత్రుల పర్యటన.. జిల్లాలో భద్రత కట్టుదిట్టం
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా వాజేడు మండలంలో వర్షం పడడంతో సభా ప్రాంగణం మారింది. నష్టపరిహారం చెక్కుల పంపిణీ కోసం ఐటీఐ కళాశాల వద్ద సభ ఏర్పాటయ్యింది.
మరోవైపు మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. భద్రత కోసం ములుగు మొత్తం పోలీసులు అలెర్ట్ అయ్యారు. వాహనాలను చెక్ చేస్తూ అనుమతులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
Van Mahotsav 2025: తెలంగాణలో నేటి నుంచి వన మహోత్సవం… ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం
Healthy Street Foods: ఈ స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచివి.. కనిపిస్తే తినేయండి..
Mahesh Babu: చిక్కుల్లో మహేష్ బాబు.. మరోసారి.. మహేశ్ బాబుకు లీగల్ నోటీసులు