Telangana Politics: రాష్ట్రంలో మూడు పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలతో రాజకీయ వాతావరణం ఎన్నికలను తలపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు ఇంకా మూడేండ్లు ఉన్నప్పటికీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం పరిపాటిగా మారింది. ఈ దశలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజే (ఆగస్టు 10) ఆయన తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నది.
Telangana Politics: ఇదే దశలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. అయితే ఈ సమయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ప్రకటన కలకలం రేపింది. బీఆర్ఎస్ నుంచి ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పిడుగులాంటి వార్తను పేల్చారు. దీంతో అటు బీఆర్ఎస్‌లో కలకలం రేపగా, బీజేపీ, కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠకు దారితీసింది.
Telangana Politics: బీఆర్ఎస్ పార్టీలో ఆ ఎమ్మెల్యేలు ఇమడలేక పోతున్నారని, ఈ కారణంగానే వారు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని కూడా ఆయన పిడుగులాంటి వార్తను బయటకు వదిలారు.
Telangana Politics: ఈ పరిస్థితుల్లో ప్రధానంగా హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు అయి ఉంటారా? ఉత్తర తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు అయి ఉంటారా? అన్న విషయాల్లో ఇంకా స్పష్టత రావడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగానే బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు చేరుతున్నారా? లేకుంటే వ్యూహాత్మకంగా రామచందర్‌రావు ఈ ప్రకటనను విడుదల చేశారా? అన్నది కూడా తేలాల్సి ఉన్నది.
Telangana Politics: బీఆర్ఎస్‌లో కేసుల గోల, కవిత వ్యవహారం, కాళేశ్వరం కుంపటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ దశలో సరైన రీతిలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా.. భవిష్యత్తులో ఇటు అధికార కాంగ్రెస్ నుంచి, అటు కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీ నుంచి బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ముప్పు తప్పదనే భావనతో చాలా మంది నేతలు భావిస్తున్నారని తెలుస్తున్నది.
Telangana Politics: ఈ దశలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని భావిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామచందర్‌రావు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకున్నది. దీంతో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరై ఉంటారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. వారి చేరిక కూడా ఆగస్టులోనే ఉంటుందని చెప్పడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీలోనూ బీజేపీ ప్రకటనపై గుబులు నెలకొని ఉన్నది. దీనిపై త్వరలోనే విషయం బయటకు వస్తుందని తెలుస్తున్నది.