Telangana News: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులు.. తమకున్న అధికారాన్ని అవకాశంగా మలుచుకొని కొందరు అజమాయిషీ చేస్తుంటారు.. హావభావాల్లోనూ దర్పం ప్రదర్శిస్తుంటారు.. ఎదుటి వ్యక్తులను, ఫిర్యాదుదారులను చులకన చేస్తూ దబాయించేస్తుంటారు.. ఇలాంటి వారి వద్ద చట్టం, నిబంధనలు ఏమీ పనిచేయవు. తాము అనుకున్నదే చట్టం.. తాము చేసిందే న్యాయం.. అన్న రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడా ఇలాంటి దర్పం ప్రదర్శించిన ఓ ఎస్ఐ ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నాడు.
Telangana News: సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులు చేసిన నిర్వాకాలు ఉన్నతాధికారులకు చేరాయి. మఠంపల్లి మండలం మట్టపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డారరు. ఆ వ్యక్తికి చెందిన కారు మట్టపల్లిలోని తన ఇంటిలో ఉన్నది. ఆ కారుపై ఎస్ఐ రామాంజనేయులు కన్నుపడింది. తన సొంత అవసరాల కోసం వినియోగించుకొని తిరిగిస్తానని అమెరికాలో ఉన్న ఆ వ్యక్తిని ఒప్పించాడు. ఇంకేమి ఆ కారులో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు.
Telangana News: కొంతకాలం తర్వాత తన కారును ఇంటివద్ద అప్పజెప్పాల్సిందిగా ఆ అమెరికా వ్యక్తి ఎస్ఐని కోరాడు. రోజులు గడుస్తున్నా కారును తిరిగి ఇవ్వకుండా ఎస్ఐ ఇబ్బందులకు గురిచేయసాగాడు. ఈ సమయంలో తన పోలీస్ బుద్ధి చూపాడు. ఇక్కడ ఉన్నోళ్లే ఏమీ చేయలేరు. ఎక్కడో ఉన్నోడు ఏమి చేస్తాడులే అనుకున్నాడు. అమెరికా వ్యక్తి మాటలను పెడచెవిన పెట్టాడు. కారును ఇష్టారీతిన వాడేసుకుంటూనే ఉన్నాడు. దీంతో విసిగి వేసారిన ఆ అమెరికా వ్యక్తి డీజీపీతోపాటు జిల్లా ఎస్పీకి ఈ మెయిల్ ద్వారా ఎస్ఐ రామాజంనేయులు నిర్వాకంపై ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణకు ఆదేశించారు. దీంతో కారు వాడుకునే విషయంతోపాటు అనేక అవినీతి ఆరోపణలు వెలుగు చూశాయి.
Telangana News: విచారణ అనంతరం మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులును విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలంగాణ మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులను జారీ చేశారు. చూశారా.. ఎస్ఐ కదా.. అని కారు ఇచ్చిన పాపానికి, దానిని తిరిగి ఇవ్వకుండా పోలీస్ దర్పం ప్రదర్శించడంతో అసలుకే ఎసరొచ్చింది. ఉన్న ఉద్యోగం పోవడమే కాకుండా, అవినీతి ఆరోపణల కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది.